

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే పాత హిందీ సినిమాల్లో ప్రేమ, మహిళలను చూపించిన విధానంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దర్శకుడు శకున్ బాత్రాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను చిన్నతనంలో షారుఖ్ ఖాన్ సినిమాలను ఎంతో ఇష్టంగా చూసేదానినని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ సినిమాలను తిరిగి చూసినప్పుడు, అప్పట్లో రొమాంటిక్‌గా అనిపించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు అసౌకర్యంగా, అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా మహిళ స్పష్టంగా నిరాకరించినప్పటికీ ఆమెను పదేపదే వెంటపడటాన్ని ప్రేమగా చూపించడం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సన్నివేశాలను టీనేజ్ వయసులో గొప్ప ప్రేమకు ప్రతీకలుగా భావించేవాళ్లమని, కానీ ఇప్పుడు వాటిని మరో కోణంలో చూస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తుందని రాధికా ఆప్టే పేర్కొన్నారు. పాతకాలపు హిందీ సినిమాల్లో కోరిక, ప్రేమను ఎక్కువగా పురుషుల దృక్కోణంలోనే చూపించేవారని శకున్ బాత్రా అన్నారు. దీనికి ఏకీభవించిన రాధికా ఆప్టే, మహిళలను ఒకవైపు గ్లామర్ కోసం ఉపయోగిస్తూ, మరోవైపు మంచి-చెడుల పరిమితుల్లో బంధించడం విరుద్ధమైన చిత్రణ అని అన్నారు. మహిళలపై జోకులు వేయడం, అదే సమయంలో వారిని ‘దేవి’లా ఆదర్శీకరించడం వంటి ద్వంద్వ వైఖరి తనకు నచ్చదని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!