

‘వికసిత్ ఒడిశా’ లక్ష్యంలో గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన ‘ఒడిశా ప్రత్యేకమైన బలహీన గిరిజన తెగలు’ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. గిరిజనుల అభివృద్ధితోనే దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 గిరిజన తెగలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు.
మల్కాన్‌గిరికి చెందిన చంపా రసపద నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ మెడికల్ కళాశాలలో చేరిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొంతమంది గిరిజన ప్రతినిధులను ఆయన సత్కరించారు. గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై రూపొందించిన నివేదికను కూడా ఆవిష్కరించారు. పౌష్టికాహార లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఆదివాసీ చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!