

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న టీజీ-20 క్రికెట్ లీగ్ మెగా టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, యువ క్రీడాకారుల భవిష్యత్తుకు ఈ లీగ్ కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. గతంలో క్రికెట్ నగరాలకు మాత్రమే పరిమితమనే అభిప్రాయం ఉండేదని, ఇప్పుడు ప్రతి జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. టీజీ-20 వంటి టోర్నమెంట్‌లు యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికలుగా నిలుస్తాయని అన్నారు.
భవిష్యత్తులో తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, 21 రోజుల పాటు కొనసాగే టీజీ-20 లీగ్ విజయవంతానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!