

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తింది. సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే ప్రజాధనాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన చిన్న, మధ్యతరహా రైతులు పరిహారం కోసం ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, నిధుల కొరత పేరుతో అధికారులు వాయిదాలు కోరుతున్నారని కోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన న్యాయస్థానం, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకువచ్చి ఆ నిధులను సంక్షేమానికి వినియోగించవచ్చా అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. సంక్షేమ పథకాలు ప్రజలకు భారం కాకూడదని, ప్రభుత్వం విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించింది.
న్యాయవాది విజయ్ గోపాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. 2014 నుంచి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను పిటిషన్లో సవాలు చేశారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ.. బాల్యవివాహాలను నిరోధించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో నిధులు కేటాయించి శాసనసభ ఆమోదించినందున ప్రత్యేక చట్టం అవసరం లేదని వాదించారు. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రజా నిధులను చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఖర్చు చేయరాదని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ అవసరమని భావించిన హైకోర్టు, పథకాలపై ఉన్న స్టేను ఎత్తివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రస్తుతానికి తిరస్కరించి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు కోర్టు విచారణకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు డీజీపీతోపాటు మెటా, ఎక్స్, గూగుల్ ఎల్ఎల్సీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!