

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ ఎక్సైజ్ శాఖకు ఆయుధాల మంజూరు అంశంపై ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు పంపేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించడంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆయుధాలు మంజూరు చేస్తే ఏ స్థాయి అధికారులకు వాటిని కేటాయించాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. ఆయుధాలు మంజూరైతే పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
డ్రగ్స్, డ్యూటీ చెల్లించని మద్యం అక్రమాలపై ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి, వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని హరికిరణ్ ఆదేశించారు. బార్లు, మద్యం దుకాణాలకు సంబంధించిన ఎక్సైజ్ అద్దె రుసుమును త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు. కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, దరఖాస్తుదారులకు తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ జి. అంజన్‌రావు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్లు ఏ. శ్రీనివాసరెడ్డి, జె. హరికిషన్, టీజీబీసీఎల్ డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!