

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో సంతానం పొందే ఉద్యోగినులకు ప్రస్తుతం అందుతున్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో మొదటి ఇద్దరు పిల్లలకు వర్తించే ప్రసూతి సెలవు ప్రయోజనం మూడో బిడ్డకు కూడా అందనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖకు సంబంధించిన పద్దులపై చర్చ సందర్భంగా ఆ శాఖ మంత్రి డి.శరత్‌కుమార్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇద్దరి కంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల వరకు ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగినులకు గరిష్ఠంగా 12 వారాలు లేదా 84 రోజుల పాటు పూర్తి వేతనంతో ప్రసూతి సెలవు ఇచ్చేవారు. మూడో సంతానం విషయంలోనూ ప్రసూతి ప్రయోజనాలను నిరాకరించరాదన్న సుప్రీంకోర్టు వివరణ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో మారుతున్న జనాభా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జరిగిన ఓ వర్క్‌షాప్‌లో ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4 కంటే దిగువకు పడిపోయిందని తెలిపారు. జనాభా పునరుత్పత్తికి అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారేనని, ఈ జనాభా మార్పు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని మంత్రి అన్నారు. మూడో సంతానం పొందేలా దంపతులను ప్రోత్సహించే విధానాలను కూడా భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉందని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!