

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న ఏఐ హబ్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. డేటా సెంటర్లకు అనుమతుల విషయంలో ఎలాంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు తావులేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. డేటా సెంటర్ల కారణంగా విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని పేర్కొన్నారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని తెలిపారు.
డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీటిని అందిస్తామని లోకేశ్ వెల్లడించారు. విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నగర అవసరాల కోసం పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని చెప్పారు. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్ నీటి వినియోగం దాదాపు పదో వంతు మాత్రమేనని వివరించారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, పర్యావరణ బాధ్యతతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!