

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీ.కే. సీనా నాయక్, పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వారి పర్యటనకు సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అనంతరం శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, గోకరాజు గంగరాజు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్, ఈవో కలిసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గురూజీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!