

సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్‌కు చెందిన మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్, యూనివర్సిటీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద నమోదైన కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్, సహారన్‌పుర్‌తో పాటు దిల్లీలో మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. లఖ్‌నవూ కేంద్రంగా పనిచేసే ఈ ట్రస్ట్‌కు ఆజంఖాన్ ప్రధాన ట్రస్టీగా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ట్రస్టులో భాగస్వాములుగా ఉన్నారు.
ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన నిధులను కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్ల సహాయంతో ట్రస్ట్, యూనివర్సిటీ ఆస్తుల నిర్మాణానికి అక్రమంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. సోదాల్లో ఇప్పటివరకు ఏమైనా కీలక ఆధారాలు లభించాయా అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టడంతో ఈ వ్యవహారం మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!