

‘వాన్‌పిక్’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి రూ.543.92 కోట్లను 2021 అక్టోబర్ 4 నుంచి 6 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలంటూ యూఏఈ కోర్టు ఇచ్చిన డిక్రీని భారత్‌లో అమలు చేయాలంటూ హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టుల్లో దాఖలైన ఎగ్జిక్యూషన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వడ్డీతో కలిపి బకాయి మొత్తం సుమారు రూ.949.96 కోట్లకు చేరిందని పేర్కొంది. ఇప్పటికే ప్రసాద్ రూ.231.70 కోట్ల నగదు, తన కుమార్తె స్వాతి పేరిట ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను పూచీకత్తుగా సమర్పించారు. వాటి విలువపై ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో సుప్రీంకోర్టు రూ.250 కోట్ల విలువగా పరిగణించింది. కమర్షియల్ కోర్టులు మరో రూ.212 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశాయి. వీటికి అదనంగా మరో రూ.200 కోట్లను రెండు వారాల్లోగా రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టులు ప్రధాన ఎగ్జిక్యూషన్ పిటిషన్లతోపాటు అనుబంధ దరఖాస్తులపై నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రస్‌అల్‌ఖైమా వాదనల్లో ప్రాథమికంగా నిజం ఉన్నట్లు కనిపిస్తోందని, డిక్రీ అమలు కాకుండా ఆస్తులను వివిధ కార్పొరేట్ సంస్థల పేర్లపై ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలపై కమర్షియల్ కోర్టుల్లో ఇరుపక్షాలు వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది. నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని సంస్థలను డిక్రీ అమలులోకి తీసుకురావచ్చా? వాటి కార్పొరేట్ నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? అనే అంశాలపై కమర్షియల్ కోర్టులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలపై రస్‌అల్‌ఖైమా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!