

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీ కావడం రక్షణశాఖలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆగస్టు 30 రాత్రి 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, ఒక నైట్ విజన్ పరికరం, 1,912 తూటాలు చోరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు మాయమవడం భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
చోరీ వెనుక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా? సంఘవిద్రోహ శక్తుల ప్రేరణతో జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మద్రాస్ రెజిమెంట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనం కదలికలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో రెజిమెంట్ పరిధిలో ఓ మ్యాగజైన్ కూడా లభించినట్లు తెలుస్తోంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆర్మీ ఉన్నతాధికారులు హైఅలర్ట్ ప్రకటించి, ఆయుధాలు-మందుగుండు రికార్డులను పూర్తిగా తనిఖీ చేయించారు. భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!