

భారత సెక్యూరిటీల్లో, ముఖ్యంగా ఈక్విటీలు, బాండ్లలో అమెరికా పెట్టుబడులు గత పదేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగాయి. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2015లో భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 130 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి 390 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు అధికంగా ఉన్న 30 దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా ఆర్థిక శాఖ, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ ప్రాథమిక గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 2025లో అమెరికా పెట్టుబడిదారుల విదేశీ సెక్యూరిటీల పెట్టుబడుల విలువ 19.3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో 15.3 ట్రిలియన్ డాలర్లు ఈక్విటీల్లో, 3.6 ట్రిలియన్ డాలర్లు దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో, 0.4 ట్రిలియన్ డాలర్లు స్వల్పకాలిక డెట్ సెక్యూరిటీల్లో ఉన్నాయి.
2025 చివరి నాటికి భారత ఈక్విటీల్లో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లకు చేరింది. 2024లో ఇది 373 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడులు కూడా 10 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ గణాంకాలు అమెరికా పెట్టుబడిదారులు కలిగి ఉన్న భారత సెక్యూరిటీల మార్కెట్ విలువను మాత్రమే సూచిస్తాయి. తయారీ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, ఇతర భౌతిక ఆస్తుల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇందులో లెక్కించలేదు. మరోవైపు చైనాలో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ 318 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో సుమారు 300 బిలియన్ డాలర్లు చైనా ఈక్విటీల్లో, 17 బిలియన్ డాలర్లు దీర్ఘకాలిక డెట్ సెక్యూరిటీల్లో ఉన్నాయి. దీంతో చైనా కంటే భారత్‌లో అమెరికా పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల విలువ అధికంగా నమోదైంది.




కామెంట్స్ (1)
Great 👍