

సాధారణ పని వేళల అనంతరం కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ప్రామాణిక విధానాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి కూల్చివేతలు, జీవించే హక్కుకు భంగం కలిగించే అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలూ న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అన్ని హైకోర్టులకు నోటీసులు జారీ చేస్తూ, అత్యవసరం కాని కేసులతో ఈ విధానాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
మరో కేసులో దివ్యాంగులను అవమానించే వ్యాఖ్యలకు సంబంధించి కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్లు రణవీర్ అలహాబాదియా, ఆశీష్ చంచ్లానీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన గత ఆదేశాలను పాటించకుండా న్యాయవ్యవస్థను అవమానించారని పేర్కొంటూ, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభావం కలిగిన వ్యక్తులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!