

ప్రపంచ ఆర్థిక సాంకేతికత, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణ సేవల్లో ప్రముఖ సంస్థగా ఉన్న అమెరికాకు చెందిన ఎస్‌ఈఐ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. హైటెక్ సిటీలో సుమారు 1.37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 1,200 మంది నిపుణులు పనిచేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ.. భవిష్యత్తులో తన బృందాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఓక్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌ఈఐ ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలకు ఎస్‌ఈఐ సేవలందిస్తోందని తెలిపారు. దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తుల నిర్వహణ, సలహాలు, పరిపాలనా సేవలతో పాటు తన వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా 8.1 ట్రిలియన్ డాలర్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోందని వివరించారు. హైదరాబాద్ జీసీసీ ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు అవసరమైన సాంకేతికత, సేవలను అందించే కీలక కేంద్రంగా ఎదగనుందని పేర్కొన్నారు.
మరోవైపు, గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలను తెలంగాణకు విస్తరించి, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్‌ను మరో ప్రధాన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, రక్షణ, ఐటీ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’ సన్నాహాల్లో భాగంగా ఫిక్కీతో కలిసి అహ్మదాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. గుజరాత్ నుంచి పరిశ్రమలను తరలించాలన్నది తమ ఉద్దేశం కాదని, వ్యాపార అవకాశాలను తెలంగాణకు కూడా విస్తరించాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భూములు సిద్ధంగా ఉన్నాయని, కొత్త పారిశ్రామిక విధానాలు అమల్లోకి వస్తున్నాయని, ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!