

గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన మిర్చి సరకు విషయంలో సమస్య తలెత్తింది. అఫ్లోటాక్సిన్, తేమ శాతం అనుమతించిన పరిమితికి మించి ఉండటంతో శ్రీలంక అధికారులు పదుల సంఖ్యలో కంటెయినర్లను తిరస్కరించారు. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, గుంటూరు యార్డుకు రైతులు తీసుకొచ్చిన పంటను వ్యాపారులు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్లతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జులై నుంచి శ్రీలంకకు చెన్నై పోర్టు ద్వారా పంపిన కంటెయినర్లలో నమూనాలను శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ (ఎస్‌ఎల్‌ఎస్‌ఐ) అధికారులు పరీక్షలకు పంపిస్తున్నారు. అఫ్లోటాక్సిన్, తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో సరకును వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతిదారులకు నోటీసులు జారీ చేశారు. అధిక తేమ కారణంగా కొన్ని సరుకుల్లో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంతో ఎగుమతి వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం కొందరు వ్యాపారులు శ్రీలంక వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరకు నాణ్యత విషయంలో రాజీ పడే అవకాశం లేదని శ్రీలంక అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో విడతలో మూడు, నాలుగు కంటెయినర్ల చొప్పున తిరస్కరణకు గురవుతున్నాయని, రెండు నెలల్లో పదుల సంఖ్యలో కంటెయినర్లను తిరిగి భారత్‌కు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. సరకు శ్రీలంక చేరిన తర్వాత ల్యాబ్ నివేదిక రావడానికి సుమారు రెండు వారాలు పడుతోంది. తిరస్కరించిన సరకును తిరిగి భారత్‌కు తీసుకొచ్చి రీప్యాకింగ్ చేసి స్థానికంగా విక్రయించడం కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వ్యాపారులు తెలిపారు. అధిక పురుగుమందుల వినియోగం, కోత అనంతర యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల నాణ్యత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటూ రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!