

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకుంది. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని సమర్థంగా అమలు చేసినందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ‘ఆధార్ సంవాద్-2026’ జాతీయ అవార్డుతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీని సత్కరించింది. కోల్‌కతాలో మంగళవారం నిర్వహించిన ఐదో జాతీయ భాగస్వాముల సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత, వాణిజ్య-పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమక్షంలో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఇతరుల పేర్లతో హాజరయ్యే నకిలీ అభ్యర్థులను అరికట్టేందుకు యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ మార్గదర్శకత్వంలో బోర్డు అంతర్జాల రహిత ఆధార్ ముఖ గుర్తింపు విధానాన్ని తొలిసారిగా అమలు చేసింది. గత ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు తొలి విడత దరఖాస్తుల సమయంలో 4,23,348 మంది అభ్యర్థులు, అంటే 98.7 శాతం మంది, మొబైల్ ఫోన్ల ద్వారా ఆధార్ యాప్‌ను ఉపయోగించి ముఖ గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. మిగిలిన 5,652 మంది అభ్యర్థులకు సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నియామక ప్రక్రియల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆధార్ సాంకేతికతను వినియోగించిన తీరును యూఐడీఏఐ ప్రశంసించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!