

తెలంగాణలో ఆదిలాబాద్, మామునూరు (వరంగల్) విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం సమావేశమై రాష్ట్ర విమానయాన రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి అప్పగించిందని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల, కార్గో టెర్మినల్‌తో పాటు ఎంఆర్‌ఓ సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. రన్‌వే తుది నిర్ణయానికి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
మామునూరు విమానాశ్రయానికి రెండు వారాల్లో టెండర్లు పిలిచి, డిసెంబరులో వాటిని ఖరారు చేసి అదే నెలలో పనులకు శంకుస్థాపన చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. హెలీ టూరిజం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!