

వీబీజీ రామ్‌జీ (VB GRAM G) చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖలు రాసిన సీతక్క, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు పేదలు, దళితులు, గిరిజనులు, భూమిలేని గ్రామీణ కుటుంబాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. నిధుల కేటాయింపును రాష్ట్ర స్థాయిలో నిర్ణయించడం వల్ల వెనుకబడిన జిల్లాల ఉపాధి అవసరాలు పక్కనపడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల వంటి రాష్ట్ర గృహ నిర్మాణ పథకాలను కొత్త చట్ట పరిధిలో చేర్చాలని, వ్యవసాయ అనుబంధ పనులు, భూ అభివృద్ధి కార్యక్రమాలు, జీవనోపాధి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. అలాగే చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామాన్ని రద్దు చేయాలని కోరారు. ఉపాధి హక్కులను కాపాడడం, గ్రామ పంచాయతీల అధికారాలను బలోపేతం చేయడం, దళితులు, గిరిజనులు, భూమిలేని కుటుంబాల జీవనోపాధిని రక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ సూచనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!