

ఆస్తి పత్రాలను పోగొట్టిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడు బి. వెంకటేశంకు రూ.3 లక్షల పరిహారంతో పాటు కేసు ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇబ్రహీంపట్నం బొంగులూరుకు చెందిన వెంకటేశం ఎస్బీఐ ఆదిభట్ల శాఖ నుంచి రూ.5 లక్షల గృహ రుణం తీసుకుని, అదనపు గ్యారంటీగా బైరామల్‌గూడలోని 194 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లను బ్యాంకులో జమ చేశారు.
2022 మార్చిలో రుణం పూర్తిగా చెల్లించిన అనంతరం నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకున్న వెంకటేశం, తన ఒరిజినల్ పత్రాలను తిరిగి ఇవ్వాలని బ్యాంకును కోరారు. అయితే పత్రాలు పోయాయని చెప్పి బ్యాంకు సర్టిఫైడ్ కాపీలు మాత్రమే అందించింది. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యామ్నాయ పత్రాలు ఇచ్చామని బ్యాంకు వాదించినప్పటికీ, రుణ ఖాతా వెంకటేశం పేరుతో ఉన్నందున ఆయనకు పరిహారం పొందే హక్కు ఉందని కమిషన్ పేర్కొంది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగానే నష్టం జరిగిందని స్పష్టం చేస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!