

తెలంగాణ ప్రజలకు, రాజకీయ పార్టీల నాయకులకు, విపక్ష నాయకులకు, మీడియా ప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ రోజు రాజకీయాలు మాట్లాడాల్సి రావడం తప్పనిసరి పరిస్థితి అని అన్నారు. స్పీకర్‌ను కులం పేరుతో దూషించిన పరిస్థితి దారుణమని, దీనితో బీఆర్‌ఎస్‌కు దళితుల పట్ల ఉన్న వైఖరి స్పష్టమవుతోందని విమర్శించారు. స్పీకర్‌పై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దళిత కార్డును ఎలా ఉపయోగించారో ప్రజలు చూశారని, గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకారులను ఏ విధంగా అవమానించారో కూడా ప్రజలకు తెలుసని అన్నారు.
2003లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించిన డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్నానని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ హామీల అమలుపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దళితులపై జరిగిన అత్యాచారాలు, దాడుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎంతమందికి ప్రయోజనం కల్పించారో చెప్పాలని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోదని, ఆయన సూచనలు, విలువలను ఆచరణలో పెట్టాలని అన్నారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య దేశంలో అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని, రీల్ మాక్ అసెంబ్లీ నిర్వహించడం కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!