

ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏడు కారిడార్లతో రూపొందించిన రెండో దశ డీపీఆర్‌ను పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరణ అత్యవసరమైందని ఆయన వివరించారు. రెండో, మూడో దశల పనులు సజావుగా సాగేందుకు తొలి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రెండో దశలో 129 కిలోమీటర్ల మేర ఏడు మెట్రో కారిడార్ల నిర్మాణాన్ని రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో మూడో దశ ప్రాజెక్టును కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!