

ఝార్ఖండ్‌లో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. నియామక పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు రాంచీకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించి వారిని అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఆందోళనలో భాగంగా ఆరుగురు విద్యార్థుల నిరాహార దీక్ష కొనసాగుతోంది.
జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యులు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆగస్టు 10 నుంచి వారిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 19 మందిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలు జరిపి వారి పలు డిమాండ్లపై సానుకూలంగా స్పందించినప్పటికీ.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న ప్రధాన డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు తెలిపారు. దీంతో తమ నిరసనలను కొనసాగిస్తామని ప్రకటించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!