

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తరఫున అతిథులకు అందించనున్న ఆహ్వాన కిట్లు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘ఇండిపెండెన్స్ డే ఎట్ హోమ్’ పేరుతో రూపొందించిన ఈ కిట్లలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన సుమారు 50 మంది కళాకారులు సహా మొత్తం 130 మంది కళాకారులు వీటి తయారీలో భాగస్వాములయ్యారు.
రాష్ట్రపతి భవన్ అధికారులు, అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) బృందం పర్యవేక్షణలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ కిట్లను రూపొందించారు. పర్యావరణహిత హస్తకళా పద్ధతులు, సంప్రదాయ కళల సమ్మేళనంతో వీటి తయారీ చేపట్టారు. కళాకారులు, వారి బృందాలు మూడు నెలలకు పైగా శ్రమించి ఈ ప్రత్యేక కిట్లను సిద్ధం చేసినట్లు ఎన్ఐడీ డైరెక్టర్ అశోక్ మండల్ తెలిపారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్ కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!