

క్రెడిట్ కార్డులను రోజువారీ ఖర్చులకు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు అప్పుడప్పుడు కార్డు పరిమితిని పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటే లిమిట్ పెంపు వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) తగ్గుతుంది. ఉదాహరణకు రూ.లక్ష లిమిట్ ఉన్న కార్డుతో నెలకు రూ.30 వేలు ఖర్చు చేస్తే CUR 30 శాతంగా ఉంటుంది. అదే లిమిట్‌ను రూ.2 లక్షలకు పెంచి, ఖర్చు రూ.30 వేలుగానే ఉంటే CUR 15 శాతానికి తగ్గుతుంది. తక్కువ క్రెడిట్ వినియోగ నిష్పత్తి క్రెడిట్ ప్రొఫైల్‌కు అనుకూలంగా ఉండొచ్చు. భవిష్యత్తులో రుణాలకు దరఖాస్తు చేసినప్పుడు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
అయితే లిమిట్ పెరిగిందనే కారణంతో ఖర్చులను పెంచితే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల బిల్లులు పెరగడంతో పాటు సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, అదనపు ఛార్జీలు పడవచ్చు. పేమెంట్లు ఆలస్యం కావడం లేదా మిస్ కావడం క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. కాబట్టి సకాలంలో పూర్తి బిల్లులు చెల్లించే అలవాటు ఉన్నవారు లిమిట్ పెంపును పరిగణించవచ్చు. తరచూ కనీస బిల్లు మాత్రమే చెల్లించే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లిమిట్ పెంపును అంగీకరించే ముందు తమ చెల్లింపు అలవాట్లను పరిశీలించి, అవసరమైతే ఆటో డెబిట్ ఏర్పాటు చేసుకోవాలి. పెరిగిన లిమిట్‌ను పూర్తిగా వినియోగించకుండా ఖర్చులను అదుపులో ఉంచడం కీలకం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!