

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన, నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
నీట్ పేపర్ లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై దాడులు చేయడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆడ విద్యార్థులపై కూడా దాడులు జరిగాయని ఆరోపించారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసన చేపట్టారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని అన్నారు.
తెలంగాణలో గతంలో జరిగిన ఇంటర్ ఫలితాల వివాదాన్ని ప్రస్తావించిన సీఎం, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. యువత, విద్యార్థుల తరఫున కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!