

2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ మహా ఆధ్యాత్మిక వేడుకకు దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం, 66 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ భారీ వేడుక అనంతరం మరో ఆధ్యాత్మిక మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 2027లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, అఖాడాలు, భక్తులు గంగానది తీరానికి చేరుకోనున్నారు.
హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా 2027 జనవరి 14 నుంచి ఏప్రిల్ 20 వరకు జరగనుంది. మకర సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే ఈ వేడుక చైత్ర పౌర్ణమితో ముగియనుంది. ఈ నాలుగు నెలల పాటు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులకు పలు ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి, ఫిబ్రవరి 6న మౌని అమావాస్య, ఫిబ్రవరి 11న వసంత పంచమి, ఫిబ్రవరి 20న మాఘ పౌర్ణమి సందర్భంగా స్నానాలు నిర్వహించనున్నారు. మార్చి 6న మహాశివరాత్రి, మార్చి 8న ఫాల్గుణ అమావాస్య, మార్చి 15న దేవ్ డోలీ స్నానం జరగనున్నాయి.
ఇక ఏప్రిల్ 7న నవ సంవత్‌సర స్నానం, ఏప్రిల్ 14న మేష సంక్రాంతి, ఏప్రిల్ 15న శ్రీరామ నవమి, ఏప్రిల్ 20న చైత్ర పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానాలు నిర్వహించనున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం మహాశివరాత్రి, ఫాల్గుణ అమావాస్య, దేవ్ డోలీ స్నానం, మేష సంక్రాంతి రోజులను అమృత స్నానాలుగా గుర్తించారు. ఈ ప్రత్యేక రోజుల్లో అఖాడాలకు చెందిన సాధువులు, నాగసాధువులు సంప్రదాయ ఊరేగింపులతో గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ముఖ్యంగా హర్ కి పౌరి సహా ప్రధాన ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది.
హిందూ సంప్రదాయం ప్రకారం, పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. హరిద్వార్‌లో చివరిసారిగా 2021లో పూర్ణ కుంభమేళా జరిగింది. ఈ నేపథ్యంలో 2027లో జరిగే వేడుకను అర్ధ కుంభమేళాగా పరిగణిస్తున్నారు. అయితే ఈసారి కూడా పూర్ణ కుంభమేళా స్థాయిలో వైభవంగా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కుంభమేళా సమయంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతూ దేశవ్యాప్తంగా భక్తులు హరిద్వార్‌కు తరలివచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!