

రష్యాలోని సైబీరియా ప్రాంతం ఇర్కుట్స్క్ సమీపంలోని షెలెఖోవ్లో 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ తీవ్రమైన న్యుమోనియాతో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ పరిశోధనా సంస్థలో పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. పని సమయంలో జీవ పదార్థం ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలినట్లు ఆమె వైద్య సిబ్బందికి తెలిపినట్లు సమాచారం. అనంతరం తీవ్ర న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆమె మరణానికి ప్లేగే కారణమని రష్యా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.
ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సుమారు 197 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వారిలో పలువురిని ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. షెలెఖోవ్ జిల్లా ఆసుపత్రిలో క్వారంటైన్ చర్యలు చేపట్టడంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు అమలు చేస్తున్నారు. మహిళకు యెర్సినియా పెస్టిస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వ్యాధికారకాన్ని అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. న్యుమోనిక్ ప్లేగు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, శ్వాసకోశ తుంపరల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!