

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన సాగునీటి సంక్షోభంపై రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, రైతుల సమస్యలపై సమగ్రంగా చర్చించారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, రైతులకు ప్రభుత్వ సూచనలను సమర్థంగా చేరవేయాలని అధికారులను కోరారు.
కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతాల రైతుల కోసం ఏలేరు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి, భుజం శస్త్రచికిత్స అనంతర కోలుకునే ప్రక్రియ గురించి మంత్రి ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!