

కేరళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో ఓనంకు ప్రత్యేక స్థానం ఉంది. పంటల పండుగగా మాత్రమే కాకుండా, ప్రజలను ఎంతో ప్రేమించిన మహారాజు మహాబలిని స్మరించుకునే పర్వదినంగా కూడా ఓనం ప్రసిద్ధి చెందింది. పురాణ కథనాల ప్రకారం మహాబలి ఒక అసుర రాజు. ఆయన దానగుణం, ధర్మబద్ధమైన పాలనకు ప్రసిద్ధి చెందాడు. మహాబలి పాలనలో పేదరికం, ఆకలి, అన్యాయం, అసూయ వంటి వాటికి చోటులేకుండా ప్రజలు సుఖసంతోషాలతో, సమానత్వంతో జీవించేవారని విశ్వాసం. మహాబలి కీర్తి మూడు లోకాలకూ వ్యాపించడంతో దేవతలు ఆందోళన చెందగా, మహాబలి దానగుణాన్ని పరీక్షించడంతో పాటు దేవతల ఆందోళనను తొలగించేందుకు మహావిష్ణువు వామన అవతారం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
మహాబలి నిర్వహిస్తున్న యజ్ఞానికి వామనుడు చిన్న బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి మూడు అడుగుల భూమిని దానంగా కోరాడు. చిన్న కోరికే కావడంతో మహాబలి వెంటనే అంగీకరించాడు. అనంతరం వామనుడు విశ్వరూపాన్ని ధరించి మొదటి అడుగుతో ఆకాశాన్ని, రెండో అడుగుతో భూమిని కొలిచాడు. మూడో అడుగు వేయడానికి స్థలం లేకపోవడంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మహాబలి తన తలనే సమర్పించాడు. వామనుడు మూడో అడుగును అతని తలపై ఉంచి పాతాళానికి పంపినట్లు కథనం. అయితే మహాబలి నిజాయితీ, దానగుణం, త్యాగానికి మెచ్చిన విష్ణువు అతనికి వరం ప్రసాదించాడు. తన ప్రజలను ఎంతో ప్రేమించిన మహాబలి ఏడాదికి ఒక్కసారైనా వారిని కలుసుకునే అవకాశం కోరగా, విష్ణువు అంగీకరించినట్లు నమ్మకం. మహాబలి వార్షికంగా తన ప్రజలను కలుసుకునే సందర్భాన్నే ఓనం పండుగగా కేరళ ప్రజలు జరుపుకుంటారు. ఇళ్ల ముందు పూలతో అత్తపూకలం ఏర్పాటు చేసి, సంప్రదాయ ఓనసദ്യను సిద్ధం చేసి వేడుకలు నిర్వహిస్తారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత, సంపదకు ఓనం ప్రతీకగా నిలుస్తుంది. 2026లో ఓనం ప్రధానమైన తిరువోణం పండుగ ఆగస్టు 26న జరగనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!