

సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల నిర్ణయాలపై వినియోగదారులు అప్పీల్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ అప్పలేట్ కమిటీ(జీఏసీ) భారీగా పెరిగిన పెండింగ్ కేసులతో సతమతమవుతోంది. సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) తాజా విశ్లేషణ ప్రకారం, 2026 సెప్టెంబర్ నాటికి జీఏసీకి మొత్తం 63,353 అప్పీళ్లు అందగా, వాటిలో 49,978 ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అప్పీళ్ల సంఖ్యకు, పరిష్కరించిన కేసులకు మధ్య భారీ అంతరం ఏర్పడిందని ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ పేర్కొంది.
అప్పీళ్ల పరిష్కారంలో జాప్యంపై కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ ట్రాకింగ్ ప్రకారం, ప్రస్తుతం ఒక్కో అప్పీల్ పరిష్కారానికి సగటున 90 నుంచి 100 రోజుల సమయం పడుతోంది. అయితే జీఏసీ వ్యవస్థలో 30 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. పరిష్కార ప్రక్రియకు స్పష్టమైన గడువులు, మెరుగైన పారదర్శకత, విధానపరమైన భద్రతలు, అదనపు వనరులు అవసరమని ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ సూచించింది.
సోషల్ మీడియా, ఇతర మధ్యవర్తి సంస్థల గ్రీవెన్స్ అధికారుల నిర్ణయాలతో అసంతృప్తి చెందిన వినియోగదారుల అప్పీళ్లను పరిష్కరించేందుకు సమాచార సాంకేతిక నిబంధనల ప్రకారం జీఏసీ ఏర్పాటైంది. మొత్తం అప్పీల్ ప్రక్రియ డిజిటల్ విధానంలోనే కొనసాగుతుందని జీఏసీ అధికారిక వెబ్‌సైట్ వెల్లడిస్తోంది. పెరుగుతున్న పెండింగ్ కేసుల నేపథ్యంలో కమిటీ సామర్థ్యాన్ని పెంచి వినియోగదారులకు సకాలంలో పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!