

రాష్ట్రంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన స్క్రీనింగ్ చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్కానింగ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా, అనుమానితుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపనున్నారు. ఇప్పటివరకు 58 మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, ఎవరికీ ఎబోలా లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!