

నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తీసుకుంది. ఈ భారీ కుట్ర వెనక పుణేకు చెందిన మనీషా వాఘ్మారే అనే 46 ఏళ్ల బ్యూటీషియన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులు, కార్పొరేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో ఏర్పరుచుకున్న పరిచయాల ద్వారా ఆమె ప్రత్యేక నెట్వర్క్ నడిపినట్లు వెల్లడైంది. అదే నెట్‌వర్క్‌ను ఉపయోగించి నీట్ ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు సీబీఐ చెబుతోంది. మనీషా ఇచ్చిన సమాచారంతో ప్యానెల్ సభ్యురాలు మనీషా గురునాథ్ మందరే, కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా ఈ ముఠా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు బయటపడింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రముఖ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. అతని ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లీకైన ప్రశ్నపత్రం లభించినట్లు సమాచారం. పరీక్షకు పది రోజుల ముందే ప్రశ్నలు, సమాధానాల సెట్‌ను సేకరించి ఎంపిక చేసిన విద్యార్థులకు చేతిరాత నోట్స్ రూపంలో అందించినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్ష పూర్తయ్యాక ఆధారాలను తగలబెట్టినట్లు సీబీఐ గుర్తించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!