

వైద్య, దంతవైద్య, ఆయుష్ మరియు అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (యూజీ) పునఃపరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది పరీక్ష రాశారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్శుల్ బన్సల్ 720కి 715 మార్కులతో సంయుక్తంగా టాపర్లుగా నిలిచారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఆలిండియా ర్యాంకుల్లో విశేష ప్రతిభ కనబరిచారు. హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు 705 మార్కులతో ఆలిండియా 13వ ర్యాంకు సాధించగా, బూర సాయిచరణ్ (19), కందగట్ల అనిష్ (21), అందెం సాయిచరణ్‌రెడ్డి (38), మయూక్ జయసింహ (42), కొంపెల్ల సాయిగాయత్రి (83), రుతుంబిక మొహంతి (91), దేవిష్ శ్రీగోపాల్ అగర్వాల్ (123) ర్యాంకులు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకుతో పాటు గ్రంధి హనీష్ (74), రేలంగి జయషణ్ముఖి (86), కొండ్రెడ్డి హారిక దేవిశ్రీ అనూహ్య (103), వంగా శ్రీనివాసరెడ్డి (125), వడ్డేపల్లి దుష్యంత్ (126) ప్రతిభ చాటారు. ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించనుండగా, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్నాయి. తెలంగాణలో మొత్తం 66 మెడికల్ కళాశాలల్లో 9,650 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆలిండియా కౌన్సెలింగ్ అనంతరం ఆగస్టులో రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!