

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. బీసీ జనగణన అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిల్‌తో పాటు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిల్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తయిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించగలమని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక స్థితిగతుల సర్వే పూర్తయిందని, బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!