

గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంలో టీజీ20 లీగ్ కీలక వేదికగా నిలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తొలి టీజీ20 సీజన్ విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టును అభినందిస్తూ ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ ప్రోత్సాహంతో ఈ లీగ్‌కు ఐపీఎల్ స్థాయి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. యువ క్రికెటర్ల అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీలో లక్ష మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా విజేత హైదరాబాద్ జట్టుకు ప్రకటించిన రూ.1 కోటి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పతక విజేతలకు నగదు బహుమతులతో పాటు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1, జీవాంజి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇషా సింగ్‌కు రూ.3 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించామని చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణ, ఒలింపిక్ ప్రమాణాలతో అకాడమీ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. యువ క్రీడాకారులు గుర్తింపు వచ్చిన తర్వాత కూడా ఏకాగ్రత కోల్పోకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!