

గగన్‌యాన్, చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న వేళ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో 120 మందికిపైగా గ్రూప్-ఏ సీనియర్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు గత ఏడాదిలో స్వచ్ఛంద పదవీవిరమణ లేదా రాజీనామాలు చేయడం చర్చనీయాంశమైంది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్‌సీ), సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ), ఇస్ట్రాక్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ తదితర కీలక కేంద్రాల నుంచి ఈ రాజీనామాలు నమోదయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతరిక్ష శాఖ (డీఓఎస్) కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని అన్ని ఇస్రో కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌వీఎం3 ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ సహా గగన్‌యాన్ మిషన్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారుల రాజీనామాల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని పరిపాలనా అంశంగా అభివర్ణించగా, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ కీలక అంతరిక్ష మిషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని, అవసరమైన చోట కొత్త అధికారులను నియమించి ప్రాజెక్టులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల అవకాశాలు పెరగడం కూడా ఈ రాజీనామాలకు ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!