

బాలీవుడ్‌లో యుద్ధ నేపథ్య చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ నిజ జీవితంలోనూ సైనికులతో కలిసి పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికులకు తన వంతు సహాయం అందించేందుకు కశ్మీర్‌కు వెళ్లినట్లు ఆయన గతంలో వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్న నానా.. తొలుత సైనిక ఉన్నతాధికారులను సంప్రదించి సరిహద్దుల్లో సేవ చేయడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే ప్రత్యేక అనుమతి అవసరమని అధికారులు చెప్పడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
‘ప్రహార్’ సినిమా కోసం నానా పటేకర్ 1990ల ప్రారంభంలో మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీతో కలిసి సుమారు మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందారు. ఈ అనుభవం కారణంగా 1999 ఆగస్టులో ప్రత్యేక అనుమతితో కశ్మీర్‌కు వెళ్లి రెండు వారాలకు పైగా సైనికులతో కలిసి పనిచేశారు. ఎల్‌ఓసీ సమీపంలో సైనికులకు సహకరించడంతో పాటు బేస్ హాస్పిటల్, క్యూఆర్‌టీ కార్యకలాపాలు, లాజిస్టిక్స్ పనుల్లోనూ పాల్గొన్నట్లు తెలిపారు. శ్రీనగర్ వెళ్లే సమయంలో 76 కిలోలుగా ఉన్న తన బరువు తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిందని నానా గుర్తుచేసుకున్నారు. అనంతరం నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ‘తిరంగా’, ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!