

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రికి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన తల్లి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాంతాచారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, టిమ్స్‌కు ఆయన పేరు పెడితే తెలంగాణ అమరులకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుందని అన్నారు.
శంకరమ్మ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు గుర్తింపు ఇస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం, మంత్రులను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్‌ను ఏడుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాలుగుసార్లు కలిసి తమ సమస్యలు వివరించినట్లు తెలిపారు. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా శ్రీకాంతాచారి ఆత్మాహుతికి యత్నించి, డిసెంబర్ 3న చికిత్స పొందుతూ మృతి చెందారని గుర్తు చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!