

తమిళనాడులోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. టెక్నాలజీపై ఆసక్తితో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టి అగ్రస్థాయికి ఎదిగిన ఎన్. చంద్రశేఖరన్ ఇప్పుడు టాటా సన్స్ ఛైర్మన్ పదవికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. 1963లో తమిళనాడులోని మోహనూర్‌లో జన్మించిన ఆయన ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో టీసీఎస్ బోర్డు సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి.. 2009లో 46 ఏళ్ల వయసులో సీఈఓ, ఎండీగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ భారీగా విస్తరించి 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయ మైలురాయిని దాటింది.
2016లో టాటా సన్స్ బోర్డులో చేరిన చంద్రశేఖరన్.. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టాటా కుటుంబానికి చెందని, పార్సీేతర వ్యక్తిగా ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 2022లో రెండోసారి ఛైర్మన్‌గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ వ్యాపారాలు వంటి కొత్త రంగాల్లో విస్తరించింది. ప్రభుత్వ చేతుల్లో ఉన్న ఎయిరిండియాను తిరిగి టాటాల సొంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం ఎయిరిండియా-విస్తారా విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. 2027 ఫిబ్రవరి 20తో ప్రస్తుత పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, తదుపరి ఛైర్మన్‌పై స్పష్టత అవసరమని భావిస్తూ మరోసారి పునర్నియామకానికి తనను తాను ప్రతిపాదించుకోకూడదని చంద్రశేఖరన్ నిర్ణయించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!