

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తాజా ఎపిసోడ్ గత రోజు జరిగిన ముఖేష్ కెప్టెన్సీ విజయం నుంచి ప్రారంభమైంది. కెప్టెన్‌గా గెలిచిన ముఖేష్‌కు బిగ్ బాస్ మెడల్ అందించారు. కొత్తగా ఇంట్లోకి వచ్చిన మిథిలేష్ తన అగ్నిపరీక్ష బ్యాచ్ సభ్యులతో కలిసి ముఖేష్ ఆటతీరుపై చర్చిస్తూ.. అతను స్టార్ ప్లేయర్ కాదని అన్నాడు. రోహిత్ కూడా అతని మాటలకు మద్దతు ఇచ్చాడు. మరోవైపు అపూర్వ.. సృష్టి చేసిన పనుల గురించి సుధీర్‌తో మాట్లాడి, అనంతరం సృష్టితో నేరుగా చర్చించింది. తర్వాత ఇంటి సభ్యులు సరదాగా తమ ప్రేమకథలు, కామెడీ సంఘటనలను పంచుకున్నారు.
అనంతరం నాగార్జున ఇంట్లోకి వచ్చి ముందుగా సృష్టిని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. సుధీర్ నెత్తిపై చెత్త వేసిన ఘటనపై ఆమెను ప్రశ్నించారు. తన గతంలోని చేదు అనుభవాలు గుర్తుకు రావడంతోనే సుధీర్ విషయంలో భావోద్వేగంగా స్పందించానని సృష్టి చెప్పింది. అయితే సుధీర్‌తో ఆమె మాట్లాడిన వీడియోను చూపించిన నాగార్జున.. అతని మాటలను సరదాగా తీసుకున్నట్లు చెప్పిన తర్వాత ఎందుకు అంత తీవ్రంగా స్పందించావని ప్రశ్నించారు. అనంతరం సుధీర్‌ను కూడా కన్ఫెషన్ రూమ్‌కు పిలవగా.. సృష్టి తొలుత తన వివరణను అంగీకరించిందని, ఆ తర్వాత రోహిత్, త్రిగుణ్ ప్రభావంతో తనపై టార్గెట్ పెట్టిందని చెప్పాడు. ఈ విషయంలో సుధీర్ తప్పేమీ లేదని నాగార్జున తెలిపారు.
ఇక పలువురు కంటెస్టెంట్ల ఆటతీరు, ప్రవర్తనపై నాగార్జున క్లాస్ తీసుకున్నారు. నరేష్‌తో జరిగిన బజర్ టాస్కులో వంశీనే గెలిచాడని వీడియో ద్వారా స్పష్టం చేశారు. నరేష్‌కు అన్యాయం జరగలేదని చెబుతూనే, అతని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రశంసించారు. అమన్, రోహిత్ చేసిన వ్యాఖ్యలపై కూడా నాగార్జున ప్రశ్నలు సంధించారు. టాస్కుల్లో లింగ భేదాలకు చోటు లేదని, ఎవరైనా ఇబ్బంది పడితే సంచాలక్‌కు చెప్పాలని కంటెస్టెంట్లకు సూచించారు. రోహిత్ ఒక చోట మాట్లాడిన విషయాలను మరో చోట చెప్పడంపై కూడా నాగార్జున ప్రశ్నించారు. నామినేషన్స్‌లో ఉన్నవారిలో సుధీర్, ఆ తర్వాత షాలినీ సేవ్ అయ్యారు.
అనంతరం ఇంట్లోకి వచ్చిన నాగార్జున ఓ సూట్‌కేస్‌లో నగదు ఉంచి కంటెస్టెంట్లకు భారీ ఆఫర్ ఇచ్చారు. మొదట ₹5 లక్షలు ఇస్తామని, డబ్బు తీసుకుని ఎవరైనా ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని చెప్పారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తాన్ని ₹10 లక్షలకు, ఆ తర్వాత ₹15 లక్షలకు పెంచారు. దీంతో ఇటీవలే ఇంట్లోకి వచ్చిన మిథిలేష్ డబ్బు తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతన్ని ఒప్పించేందుకు ఇంటి సభ్యులకు అవకాశం ఇచ్చినా మిథిలేష్ తన నిర్ణయంపై నిలబడ్డాడు. అనంతరం ఇంటి సభ్యులతో ఓటింగ్ నిర్వహించగా.. మిథిలేష్ వారిని ఒప్పించాడు. దీంతో సూట్‌కేస్ తీసుకుని ఇంటి నుంచి బయటకు రావాలని నాగార్జున చెప్పాడు. మిథిలేష్ నిజంగానే ఇంటి నుంచి బయటకు వచ్చాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్‌లో తేలనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!