

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఎనిమిది సూచనలను ప్రతి పౌరుడు పాటించాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని నిడమర్రులో బొల్లినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బైసర్) వైద్య కళాశాల, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తుందని, భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో కూడా ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు దుబారా ఖర్చులను తగ్గించి ‘నా దేశం.. నా బాధ్యత’ అనే భావనతో వ్యవహరించాలని కోరారు. అమెరికా-ఇరాన్ ఘర్షణల ప్రభావంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు.
ఇంధన పొదుపు, సౌరశక్తి వినియోగం, దేశీయ ఉత్పత్తుల పెంపు ద్వారా స్వయం సమృద్ధి సాధించాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఇంటి, పొలంలో సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవాలని, అదనపు విద్యుత్తును విక్రయించి ఆదాయం పొందవచ్చని తెలిపారు. విదేశీ పర్యటనలకన్నా దేశీయ పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించాలని చెబుతూ అరకు లోయ, పాపికొండలు, గండికోట, సూర్యలంక బీచ్ వంటి ప్రాంతాలను ప్రస్తావించారు. దేశీయంగా బంగారం ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని, కర్నూలులో వచ్చే నెల నుంచి బంగారం గని ప్రారంభమవుతుందని వెల్లడించారు. అలాగే ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్‌లను తగ్గించి ఆదర్శంగా నిలవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!