

ముంబయి లోకల్ రైళ్లలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే అధికారులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రైళ్లలో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. కొందరు ఫుట్‌బోర్డులపై నిలబడటంతో పాటు, తలుపులకు వేలాడుతూ ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్ వ్యవస్థను నాన్-ఏసీ సబర్బన్ లోకల్ రైళ్లలోనూ ప్రవేశపెట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆటోమేటిక్ డోర్లతో రూపొందించిన తొలి నాన్-ఏసీ లోకల్ రైలు ఇప్పటికే ముంబయికి చేరుకుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారైన ఈ 12 కోచ్‌ల రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు పలు భద్రతా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆటోమేటిక్ డోర్లు మూసి ఉన్నప్పటికీ బోగీల్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా రైలు డిజైన్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఒక కోచ్ నుంచి మరో కోచ్‌కు సులభంగా వెళ్లేందుకు అనుసంధాన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ముంబయి రైల్వే పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రతిరోజూ సుమారు 70 నుంచి 80 లక్షల మంది ప్రయాణికులు సబర్బన్ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. 2025 జూన్ 9న జరిగిన రైలు ప్రమాదంలో తలుపుల వద్ద నిల్చున్న ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఏసీ లోకల్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధికారులను ఆదేశించారు. తాజాగా ఇదే భద్రతా సదుపాయాన్ని నాన్-ఏసీ కోచ్‌లకూ విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!