

తెలంగాణలో పనిచేస్తున్న సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలు, సమగ్ర సంక్షేమ పథకాలను ఈ నెల 14న రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ గతంలోనే పట్టుబట్టారని, ఈ అంశంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారని మంత్రి పేర్కొన్నారు. డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఉద్యోగ అభద్రత, తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే ఒత్తిడి, రోడ్డు ప్రమాదాల ముప్పు వంటి సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త నిబంధనలను రూపొందించినట్లు వివరించారు.
గిగ్ వర్కర్లకు పని భద్రతతో పాటు ప్రమాదాల సమయంలో రక్షణ, సామాజిక భద్రత కల్పించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. గతంలో అగ్రిగేటర్ సంస్థలు గిగ్ వర్కర్లను సాధారణ ఉద్యోగులుగా గుర్తించేందుకు వెనుకాడినప్పటికీ, వారి సంక్షేమ బాధ్యతను విస్మరించలేరని స్పష్టం చేసి చట్ట పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా గిగ్ వర్కర్లతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు లేకుండా కేవలం గిగ్ వర్కర్లు మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రత్యేక యాప్‌లో నమోదు చేసుకున్న అర్హులైన కార్మికులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!