

బ్యాటరీ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రానుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000 కోట్ల అంచనా పెట్టుబడితో ఇండో–కొరియన్ భాగస్వామ్య పరిశ్రమ ఏర్పాటు కానుంది. భారత్‌కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్ టీ సంస్థలు సంయుక్తంగా కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. 230 ఎకరాల్లో మూడు దశలుగా నిర్మించనున్న ఈ ప్లాంట్‌లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి కీలకమైన ఫెరిక్ ఫాస్ఫేట్ (FP), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) క్యాథోడ్ పదార్థాలను ఉత్పత్తి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా ఈ రెండు పదార్థాలను ఏటా 30 వేల టన్నుల చొప్పున తయారు చేసే సామర్థ్యంతో 2028 మధ్య నాటికి ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2031 నాటికి మూడో దశను పూర్తి చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. మూడు దశలు పూర్తయిన తర్వాత ఏటా 1.8 లక్షల టన్నుల చొప్పున రెండు రకాల పదార్థాలను తయారు చేయనుండగా, అందులో 1.3 లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో బుధవారం మంత్రి నారా లోకేష్‌తో కార్బన్ కాస్మో సంస్థ ప్రతినిధులు సమావేశమై పెట్టుబడులు, పరిశ్రమ నిర్మాణం, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2026 అక్టోబర్ 16న అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదరగా, నవంబర్ 6న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఆమోదం లభించింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 3,500 నుంచి 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. బ్యాటరీ క్యాథోడ్ పదార్థాల నాణ్యత పరీక్షలు, వినియోగించిన బ్యాటరీల నుంచి విలువైన పదార్థాలను తిరిగి సేకరించే రీసైక్లింగ్ సాంకేతికతపై పరిశోధనల కోసం ఐఐటీ తిరుపతితో కలిసి ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ సూచించారు. ప్రపంచస్థాయి బ్యాటరీ తయారీ సాంకేతికత రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్న ఆయన, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!