

గోదావరి డెల్టా ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో పాటు ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపేందుకు రూ.13.4 కోట్లతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈస్ట్రన్ డెల్టాకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలో వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా సిద్ధం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు.
కాలువలు, డ్రెయిన్లు, బండ్ లెవెల్, డీసిల్టింగ్, లాకులు, షట్టర్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పూడిక పేరుకుపోయిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. బ్రిటిష్ కాలంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న లాకులు, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి నిర్మించడంపై దృష్టి సారించాలని సూచించారు. డీపీఆర్‌లు సిద్ధం చేసే ముందు స్థానిక నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. డీపీఆర్‌లు పూర్తయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!