

నవాబుపేట మండలంలోని దేవరగుట్ట ప్రాంతంలో మరోసారి చిరుతల సంచారం కలకలం రేపింది. తాజాగా కొండ శిఖరంపై ఒకేసారి మూడు చిరుతలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు చిత్రీకరించిన దృశ్యాలు ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా దేవరగుట్ట పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం కొనసాగుతుండగా, పశువులపై దాడులు జరిగిన ఘటనలు కూడా పలుమార్లు నమోదయ్యాయి.
దీంతో రైతులు, కూలీలు, పశువుల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు. దేవరగుట్టకు సమీపంలోని గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లేందుకు, రహదారులపై ప్రయాణించేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. గతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోన్లు, నిఘా పరికరాలు ఫలితం ఇవ్వకపోవడంతో వాటిని తొలగించారు. ప్రస్తుతం చిరుతల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చిరుతలను పట్టుకుని సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!