

కేరళంలోని కొచ్చి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఓ ఇంటర్ విద్యార్థిని, కండక్టర్ మధ్య చోటుచేసుకున్న ఘటన వివాదానికి దారితీసింది. శనివారం ఆ విద్యార్థిని తన స్నేహితులతో కలిసి నార్త్ పరావూర్ నుంచి కొచ్చికి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఆలయ సందర్శన అనంతరం ఆమె తలనీలాలు సమర్పించి, టీ షర్ట్, జీన్స్ ధరించి ఉన్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఉన్న నేపథ్యంలో ఆమె జీరో టికెట్ కోరింది. అయితే ఆమెను అబ్బాయిగా భావించిన కండక్టర్ మహేష్ తొలుత రూ.15 టికెట్ ఇచ్చారు. జీరో టికెట్ ఇవ్వాలని విద్యార్థిని కోరడంతో ఆమె జెండర్ ఏమిటని కండక్టర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆమెకు జీరో టికెట్ ఇచ్చారు.
ఈ ఘటనపై విద్యార్థిని ఆర్టీసీ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన జెండర్ గురించి ప్రశ్నించి తనను అవమానించారని ఆమె ఆరోపించింది. దీంతో ఆర్టీసీ విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టి కండక్టర్ మహేష్‌ను సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మహేష్ ఖండించారు. కేవలం అపార్థం వల్లే ఈ ఘటన జరిగిందని, విద్యార్థినిని అబ్బాయిగా భావించడం వల్లే మొదట రూ.15 టికెట్ ఇచ్చానని తెలిపారు. ఆమె అమ్మాయి అని స్పష్టం చేసిన వెంటనే జీరో టికెట్ ఇచ్చినట్లు చెప్పారు. తన పక్కన కూర్చున్న మహిళా ప్రయాణికురాలు కూడా విద్యార్థినిని తొలుత అబ్బాయిగా భావించిందని మహేష్ పేర్కొన్నారు. తాను ఎలాంటి అసభ్యకరమైన లేదా అవమానకరమైన భాష ఉపయోగించలేదని, కొందరు ప్రయాణికులు పోలీసులకు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన చెప్పారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!