

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఇప్పటికే అడుగంటిన కొన్ని జలాశయాలు, రిజర్వాయర్లలోకి మళ్లీ వరద ప్రవాహాలు చేరుతున్నాయి. ముడసర్లోవ, గంభీరం, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత ఊరటనిచ్చినప్పటికీ, పలు ప్రాంతాల్లో పంటలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విశాఖపట్నంలోని ఎండాడలో భారీ వర్షపాతం నమోదవడంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వరదలు, పంట నష్టం నమోదైంది. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాత లోటు తగ్గగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!