

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ మీట్–2026లో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు అందించడంతో పాటు భూమి, విద్యుత్, నీటి వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు గార్డియన్గా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, బహుభాషా సంస్కృతి, అనుకూలమైన వ్యాపార వాతావరణం హైదరాబాద్ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల అభివృద్ధికి కోర్ అర్బన్ రీజియన్ (CORE), పెరి అర్బన్ రీజియన్ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ (RARE) విధానాల ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, సేవారంగం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వగా, పెరి అర్బన్ ప్రాంతంలో ఫార్మా, బయోటెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలకు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు రేడియల్ రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, స్థానిక వనరులకు విలువ జోడించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని వెల్లడించారు. సంపద కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని, పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!