

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై నవంబర్ 28న కార్తీక మహాదీపం వెలిగింది. కొండపై ఉన్న పురాతన దీపథూన్ రాతి స్తంభంపై పవిత్ర జ్యోతి వెలిగిన క్షణం భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. పలువురు చేతులెత్తి మురుగన్ స్వామిని ప్రార్థించగా.. మరికొందరు ఆనందభాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా’ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ దీపం వెలిగించడం వెనుక కొన్నిరోజులుగా కొనసాగిన వివాదం, భక్తుల నిరీక్షణ, న్యాయపోరాటం ఉండటంతో ఈ ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపథూన్ వద్ద దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, ఆ రోజు సంప్రదాయ దీప మండపం వద్దే దీపం వెలిగించడంతో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నవంబర్ 27న మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను దీపోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షకులుగా నియమించింది. దీంతో నవంబర్ 28న కట్టుదిట్టమైన భద్రత మధ్య దీపథూన్ వద్ద రాతి స్తంభంపై మహాదీపం వెలిగించారు. ముందస్తు అనుమతి పొందిన 50 మంది భక్తులకు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అనుమతించారు. ఇతర భక్తులు కొండ దిగువ నుంచే మహాదీపాన్ని దర్శించుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!